రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే మెంతులు వంటింట్లో పసుపు వర్ణంలో చిన్నని గింజలైన మెంతులు మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి. చిరు చేదును కలిగి ఉండే మెంతులను తెలుగు ఇళ్ళల్లో ఎక్కువగా ఊరగాయల తయారీలో వాడతారు. వీటిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఉదయాన్నే నానబెట్టిన మెంతులు తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉన్నందున ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. క్రమంగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో తోడ్పడు తుంది. ఇవి రక్తంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపర్చడంలో కూడా సహాయపడతాయి. మధుమేహంతో బాధపడేవారు రోజు నానబెట్టిన మెంతుల నీరు తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మెంతుల్లో శరీరానికి మేలు చేసే ఇనుము, పీచు పదా ర్థాలు, విటమిన్ సి, బి1, బి12, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. మెంతులు చర్మానికి కూడా మేలు చేస్తాయి. శరీరంలోని వాపును తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశ వంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లను వృద్ధి చేస్తాయి. మొటిమలు, ముడతలు, ఇతర చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి. నానబెట్టిన మెంతులు, పెరుగుతో కలిపి జుట్టుకు రాయడం వల్ల కేశాలు మెరవడమే కాక, జుట్టు మూలాలను బలోపేతంచేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. నానబెట్టిన మెంతులు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత నివారించడంలో ఉపయుక్తం. రుతుచక్రాల నిర్వహణ, పి.సి.ఒ.ఎస్. సమస్యల నివారణకు దోహదం చేస్తాయి. బాలింతల్లో పాల వృద్ధికి తోడ్పడతాయి. మెంతులు సహజమైన డిటాక్సిఫైర్గా పనిచేస్తాయి. శరీరంలోని వ్యర్ధాలు, టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మెంతులులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అలసిపోయిన కళ్లకు విశ్రాంతినివ్వటంలో సాయపడతాయి. మెంతులు కలిపిన పేస్ట్ లేదా జెల్‌ని కళ్ల కింద రాసుకుంటే ఉబ్బరం, నల్లటి వలయాలు, తగ్గుతాయి. సౌందర్య సాధనాల తయారీ, తల నూనెలు, ఆహార ఉత్పత్తుల్లో మెంతి నూనె, మెంతులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉత్పత్తి మన దేశంలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లలో ఎక్కువగా పండిస్తారు. రకాలు రాజేంద్ర, క్రాంతి, హిసార్ సోనాలి, పూసా ఎర్లీ బంచింగ్, లాం సెలక్షన్ 1, సిఒ 1 ముఖ్యమైనవి. మెంతుల్లో పోషక విలువలు (100 గ్రాములు) శక్తి - 323 కిలో కేలరీలు. కార్బోహైడ్రేట్లు - 58.35 గ్రా. ఆహార ఫైబర్ - 24.6 గ్రా. చక్కెర- 0గ్రా. ప్రోటీన్ - 23 గ్రా. కొవ్వు - 6.41 గ్రా. విటమిన్లు - బి6.6 మి.గ్రా. ఫోలేట్ - 57 ఎం.సి.జి. విటమిన్ సి - 3 మి.గ్రా. ఇనుము - 35.53 మి.గ్రా. మెగ్నీషియం - 191 మి.గ్రా. భాస్వరం - 296 మి.గ్రా. పొటాషియం - 770మి.గ్రా. జింక్ - 2.5 మి.గ్రా. ఆధారం: పాడిపంటలు