ఆహారంలో ప్రోబయోటిక్స్ ఆరోగ్యానికి సహజ రక్షణ "బ్యాక్టీరియా" అనే పదం వినగానే చాలామందికి వ్యాధులు గుర్తుకు వస్తాయి. కానీ అన్ని బ్యాక్టీరియా హానికరమైనవి కావు. ప్రోబయోటిక్గా పిలిచే కొన్ని సూక్ష్మజీవులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి గట్లో ఉన్న మైక్రోబయో సమతుల్యతను కాపాడుతూ, హానికరమైన సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. ప్రోబయోటిక్స్ ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుప రచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఆహారంలో ఉన్న పోషకా లు సరిగా శరీరానికి అందేలా సహాయపడటంతో పాటు, ఉబ్బరం (bloating), మలబద్ధకం (constipation), అతిసారం (diarrhea) వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ప్రత్యేకంగా యాంటి బయోటిక్స్ వాడిన తర్వాత పేగులలో ఉన్న మంచి బ్యాక్టీరియా తగ్గి పోతుంది. ఈ పరిస్థితిలో ప్రోబయోటిక్స్ వాటిని తిరిగి పునరుద్ధరించి, జీర్ణాశయం ఫ్లోరా సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయి. శాస్త్రీయంగా చూస్తే, ప్రోబయోటిక్స్ లాక్టిక్ యాసిడ్, ఇతర ఆర్గానిక్ యాసిడ్స్ను ఉత్పత్తి చేసి జీర్ణాశయం PH స్థాయిని తగ్గిస్తాయి. దీంతో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదల తగ్గు తుంది. అలాగే ఇవి షార్ట్ చైన్ ఫ్యాటి యాసిడ్స్ (SCFAs) ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి, ఇవి పేగుల ఆరోగ్యాన్ని కాపాడ టానికి, వాపు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ప్రోబయోటిక్స్ను సహజంగా పొందేందుకు పులియబెట్టిన ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చడం ఉత్తమ మార్గం. పెరుగు, కేఫీర్, మజ్జిగ వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులు లాక్టోబాసిల్లస్, పేగులలో నివసించే మేలుకర సూక్ష్మజీవి వంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను సమృద్ధిగా కలిగి ఉంటాయి. పాల పదార్థాలు ఇష్టపడని వారు సౌర్ క్రాట్, కిమ్చి వంటి పులియబెట్టిన కూరగాయలను ఉపయోగించవచ్చు. ఇవి ప్రోబయోటిక్స్ తో పాటు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అందిస్తాయి. మనదేశంలో సంప్రదాయ ఆహారాలలో కూడా ప్రోబయోటిక్స్ సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగను రోజు వారీ ఆహారంలో తీసుకోవడం సాధారణ అలవాటు. అదనంగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాలలో “పులిసిన అన్నం" (రాత్రంతా నీటిలో నానబెట్టిన అన్నం)ను ఉదయం మజ్జిగతో తీసుకోవడం ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయం. ఈవిధంగా తీసుకునే ఆహారం సహజ ప్రోబయోటిక్గా పనిచేసి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మొత్తంగా, ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజువారీ ఆహారంలో సహజ ప్రోబయోటిక్ పదార్థాలను చేర్చడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగు వంటి పులియబెట్టిన ఉత్పత్తులను శీతలీకరణలో ఉంచడం ద్వారా అందులోని సూక్ష్మజీవుల జీవశక్తి నిల్వ ఉంటుంది. అదనంగా, అధిక చక్కెరలు లేదా కృత్రిమ పదార్థాలు లేని ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. ప్రోబయోటిక్స్ ద్వారా గట్ సమతుల్యత ఎలా ఏర్పడుతుంది? ప్రోబయోటిక్స్ ఆహారం సరిగా జీర్ణం కావడంలో సహాయపడ టంతో పాటు, గ్యాస్, ఉబ్బరం (bloating), అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇవి జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రోత్సహించి, పోషకాలు శరీరానికి సులభం గా అందేలా చేస్తాయి. ప్రోబయోటిక్స్ మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఇవి సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మీటర్ల ఉత్పత్తిని ప్రభావితం చేసి, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మిల్లెట్ (చిరుధాన్యాలు) ప్రోబయోటిక్ ఆహారాలు మిల్లెట్స్ (చిరుధాన్యాలు) శరీరానికి శక్తి, ఫైబర్, ఖనిజాలు అందిస్తాయి. వీటిని ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) ద్వారా తయారు చేస్తే ప్రోబయోటిక్ గుణాలు పెరిగి జీర్ణక్రియకు మరింత ఉపయోగపడతాయి. రాగి అంబలి : రాగి పిండిని నీటిలో కలిపి రాత్రంతా పెట్టి ఉడికించి ఉదయం మజ్జిగ కలిపి తీసుకుంటారు. ఇది మంచి ప్రోబయోటిక్, శరీరాన్ని చల్లబరుస్తుంది. జొన్న అంబలి : జొన్న పిండితో అంబలి చేసి పెట్టడం ద్వారా ప్రోబయోటిక్స్ ఏర్పడతాయి. పిండిని నీటిలో కలిపి ఉడికించి, రాత్రంతా పెట్టి ఉదయం మజ్జిగ కలిపి తీసుకుంటారు. సజ్జ రవ్వ ఇడ్లీ : సజ్జ రవ్వ, లేదా మినపప్పుతో కలిపి పిండిని రాత్రంతా ఫెర్మెంట్ చేసి ఇడ్లీలు తయారు చేస్తారు. ఫెర్మెంటేషన్ వల్ల ప్రోబయోటిక్ గుణాలు పెరుగుతాయి. కొర్ర దోశ : కొర్ర, మినపప్పు కలిపి పిండిని దోశలు వేస్తారు. జీర్ణానికి సులభం, జీర్ణాశయ ఆరోగ్యానికి మంచిది. సజ్జ జావ : సజ్జ పిండిని ఉడికించి రాత్రంతా ఉంచి, ఉదయం మజ్జిగ కలిపి తీసుకుంటారు. ఇది శక్తినిచ్చే ప్రోబయోటిక్ ఆహారం. రాగి సంకటి + పెరుగు : రాగి సంకటి తీసుకునే సమయంలో పెరుగు కలిపితే ప్రోబయోటిక్ లాభాలు పొందవచ్చు. గట్లో లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయ పడుతుంది. మిల్లెట్ కాంజీ : రాగి, జొన్న, సజ్జలతో కాంజీ తయారు చేసి కొంతసేపు ఫెర్మెంట్ చేయడం ద్వారా ప్రోబయోటిక్ పానీయం అవుతుంది. ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల శరీరానికి జీర్ణక్రియ మెరుగు పడుతుంది, ఇమ్యూనిటీ పెరుగు తుంది, పేగు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే సహజంగా తినడం, శుభ్రత పాటించడం, మితంగా తీసుకోవడం అత్యవసరం. ముఖ్య సూచనలు ఫెర్మెంటేషన్ 8-12 గంటలు చేయడం మంచిది. అధిక ఉప్పు వేయకూడదు. తాజాగానే తీసుకోవాలి వేసవిలో ఇవి శరీరానికి చల్లదనం ఇస్తాయి. సహజ ప్రోబయోటిక్ ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా శరీర సమతుల్యత, మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవితానికి ప్రోబయోటిక్ను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక